: ప్రధాని ‘మేకిన్ ఇండియా’ ప్రసంగ సమయంలో గుర్రుపెట్టిన రక్షణ మంత్రి పారికర్
మనోహర్ పారికర్... బీజేపీలో పనిమంతుడిగా పేరుపడ్డ నేత. ప్రధాని మోదీకి ఆయన పనితనంపై అపార విశ్వాసం. అందుకే, గోవా ముఖ్యమంత్రిగా ఉన్న ఆయనతో సీఎం పదవికి రాజనామా చేయించి మరీ, కేంద్ర రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించారు. రక్షణ శాఖ బాధ్యతలు చేపట్టగానే మనోహర్ పారికర్ కూడా తన పనితీరును నిరూపించుకున్నారు. దేశంలోని సైనిక స్థావరాలను చుట్టిరావడంతో పాటు ఆయుధ సంపత్తి కొనుగోలుకు సంబంధించి కీలక ఒప్పందాలకు కార్యరూపం ఇవ్వగలిగారు. అంతా బాగానే ఉంది కానీ, మంగళవారం ఆయన ఓ వివాదంలో చిక్కుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం ‘మేకిన్ ఇండియా’ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రసంగం చేస్తున్న సమయంలో సభా వేదికపైనే ఉన్న పారికర్ గుర్రుపెట్టి నిద్రపోయారు. ప్రధానికి ఒక్క సీటు దూరంలోనే కూర్చున్న పారికర్ నిద్ర ఆపుకోలేకపోయారు. తల వెనక్కి వాల్చి, కళ్లు మూతలు పడి, నోరు వెళ్లబెట్టిన స్థితిలో తీసిన ఆయన ఫొటోలు వెనువెంటనే ట్విట్టర్ లో దర్శనమిచ్చాయి. ఈ ఫొటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన కాంగ్రెస్, కామెంట్ ను మాత్రం జోడించలేదు. బీజేపీ సైతం దీనిపై స్పందించలేదు.