: నేడు కాశ్మీర్ గవర్నర్ తో పీడీపీ చీఫ్ ముఫ్తీ భేటీ... ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ
జమ్మూ కాశ్మీర్ లో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీపీ) నేడు ఆ రాష్ట్ర గవర్నర్ తో భేటీ కానుంది. ఆ పార్టీ అధినేత్రి మెహబూబా ముప్తీ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రాతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఆమె గవర్నర్ తో చర్చించనున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సీట్లు ఏ ఒక్క పార్టీకి రాని నేపథ్యంలో రాష్ట్రంలోని పలు పార్టీల మధ్య సమీకరణాలు కొనసాగుతున్నాయి. తొలుత బీజేపీతో జట్టు కట్టాలని భావించిన పీడీపీ, ఆ తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్ వైపు మళ్లినట్లు తెలుస్తోంది. గవర్నర్ తో భేటీ సందర్భంగా ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని ముఫ్తీ, గవర్నర్ ను కోరనున్నట్లు విశ్వసనీయ సమాచారం.