: శ్రుతి మించితే చర్యలు తప్పవు: న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల హెచ్చరిక
కొత్త సంవత్సరాదిని పురస్కరించుకుని జరుపుకునే వేడుకల్లో శ్రుతి మించితే చర్యలు తప్పవని హైదరాబాదీలకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ర్యాష్ డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవ్ లకు సంబంధించి రోజు మాదిరిగానే అయినా మరింత మేర తనిఖీలు పెంచనున్నట్లు నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. రాత్రి 10 గంటల నుంచి నగరంలోని అన్ని ఫ్లై ఓవర్లను మూసివేయనున్నట్లు ఆయన ప్రకటించారు. రహదారులపై త్రిబుల్ రైడింగ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. బార్లు, వైన్ షాపులు రాత్రి 1 గంట వరకు తెరిచి ఉన్నా, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కొరడా ఝుళిపిస్తామని తెలిపారు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో నేటి రాత్రి నగర వీధుల్లో 15 వేల మంది పోలీసులను రంగంలోకి దించనున్నామని ఆయన వెల్లడించారు.