: దేశవాళీ బౌలర్లను కసితీరా బాదుతున్న యువరాజ్
యువరాజ్ సింగ్... ఒకప్పుడు టీమిండియాకు మూలస్తంభం! పరిస్థితులు మారాయి. ఇప్పుడు యువీ జాతీయ జట్టులో చోటు కోసం సెలక్టర్ల వైపు చూడాల్సిన దుస్థితి! వరల్డ్ కప్ కు గాను టీమిండియాలో చోటు దక్కలేదు, ఆపై ఐపీఎల్ లోనూ ఎదురుదెబ్బే. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా 'మనకెందుకులే' అని వదిలించుకుంది. అయితే, ఈ ఆటుపోట్లు యువరాజ్ మనోస్థైర్యాన్ని నీరుగార్చలేకపోయాయి. రెట్టింపు పట్టుదలతో దేశవాళీ బరిలో దిగిన ఈ పంజాబ్ యోధుడు ఇప్పుడు రంజీ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇప్పటికే 3 సెంచరీలు నమోదు చేసిన యువీ 567 పరుగులతో సీజన్ టాపర్ గా కొనసాగుతున్నాడు. హర్యానాపై 130, మహారాష్ట్రపై 136, సౌరాష్ట్రపై 182 పరుగులతో తానేమిటో ఘనంగా నిరూపించుకున్నాడు. పరుగుల సగటు చూస్తే 94.50. ప్రస్తుతం ఈ డాషింగ్ ఆల్ రౌండర్ కనబరుస్తున్న విధ్వంసక ఫామ్ చూస్తుంటే, వరల్డ్ కప్ ప్రాబబుల్స్ కు ఎంపిక చేయకపోవడం తప్పేనని సెలక్టర్లు చింతించే అవకాశాలు కనిపిస్తున్నాయి. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్కాట్ స్టైరిస్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. యువీని 30 మంది ప్రాబబుల్స్ జాబితాలో చేర్చకపోవడం ఆశ్చర్యం కలిగించిందని అన్నాడు.