: రేపటి నుంచి నవ్యాంధ్ర రాజధాని కోసం భూ సమీకరణ
గుంటూరు జిల్లా తుళ్లూరులో కొత్తగా నిర్మితం కానున్న నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని కోసం భూ సమీకరణ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. భూ సమీకరణకు సంబంధించి గుంటూరులో రెవెన్యూ అధికారులకు శిక్షణ తరగతులు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ భూ సమీకరణలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తామన్నారు. 1,000-1,400 ఎకరాల సమీకరణ బాధ్యతలు ఒక డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారికి అప్పగిస్తామన్నారు. డిప్యూటీ కలెక్టర్ నేతృత్వంలోని ప్రతి బృందంలో ఇద్దరేసి చొప్పున తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, అవసరమైన మేరకు సర్వేయర్లను నియమిస్తామన్నారు. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయం నుంచి రేపు 27 బృందాలు రానున్నాయని ఆయన తెలిపారు.