: బీజేపీతో దోస్తీ ఆత్మహత్యాసదృశ్యమే: పీడీపీ ఎమ్మెల్యేల వాదన
జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన సందిగ్ధత ఇంకా తొలగిపోలేదు. ఇదుగో, అదుగో అంటూ సాగుతున్న సమీకరణాలు ఓ పట్టాన కొలిక్కిరావడం లేదు. నిన్నటిదాకా పీడీపీ, బీజేపీల మధ్య పొత్తు ఖరారన్న వాదన కూడా నేటితో దాదాపుగా వీగిపోయింది. బీజేపీతో పొత్తుపై సాగిన పీడీపీ శాసనసభా పక్ష సమావేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనట్లు విశ్వసనీయ సమాచారం. బీజేపీతో పొత్తును మెజారిటీ ఎమ్మెల్యేలు స్వాగతిస్తున్నప్పటికీ, వ్యతిరేకిస్తున్న అతికొద్దిమంది వాదనకు సమాధానం చెప్పలేక పార్టీ అధిష్ఠానం తలపట్టుకుందట. పీడీపీ సర్కారు ఏర్పడితే మంత్రివర్గంలో కీలక భూమిక పోషిస్తారని భావిస్తున్న రాజ్ పురా ఎమ్మెల్యే హసీబ్ ద్రబూ బీజేపీతో పొత్తుకు ససేమిరా అంటున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్లేనని ఓ ఎమ్మెల్యే అధిష్ఠానం ముందు తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారట. మరోవైపు ద్రబూతో పాటు పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీ కూడా బీజేపీతో పొత్తుకు సానుకూలంగా లేరు. ఈ నేపథ్యంలో బీజేపీతో పీడీపీ దోస్తీ దాదాపుగా లేనట్లేనని తేటతెల్లమవుతోంది. దీంతో ఇటు పీడీపీతో పాటు అటు బీజేపీ కూడా కొత్త సమీకరణాల వైపు దృష్టి సారించినట్లు సమాచారం.