: పాక్ లో నిలిచిపోనున్న పది కోట్ల ప్రీపెయిడ్ కనెక్షన్లు


పాకిస్థాన్ లో టెలికాం రంగం తీవ్ర ఇక్కట్లలో చిక్కుకోనుంది. పెషావర్ ఆర్మీ స్కూల్ పై జరిగిన దాడితో పాక్ ప్రభుత్వం మేల్కొంది. పాక్ లోని పౌరుల వివరాలు తెలుసుకునేందుకు, తీవ్రవాదులను ఏరి వేసేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా టెలిఫోన్ ఆపరేటర్లకు అల్టిమేటం జారీ చేసింది. సిమ్ కార్డు కొని సర్వీసు వినియోగిస్తున్న వారి వివరాలు తక్షణం ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశించింది. దీనికి 28 రోజుల గడువు విధించింది. అయితే, గడువులోపు తాము వివరాలు అందజేయలేమని ఆపరేటర్లు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. దీంతో, సుమారు పది కోట్ల ప్రీపెయిడ్ కనెక్షన్లు ఆగిపోయే ప్రమాదం తలెత్తింది. పాకిస్థాన్ లో సుమారు 14 కోట్ల మొబైల్ కనెక్షన్లుండగా, వీటిలో కేవలం 10 శాతం పోస్టు పెయిడ్ సర్వీసులు. మిగతావన్నీ ప్రీ పెయిడ్ కనెక్షన్లే. దీంతో, ఇంత మంది ఖాతాదారుల పూర్తి వివరాలు ప్రభుత్వానికి సమర్పించాలంటే వారి దరఖాస్తు వివరాలు పరిశీలించాలి. అందుకు ఎంతో సమయం పడుతుంది. అందుకు 150 నుంచి 200 రోజుల గడువు కావాలని టెలికాం ఆపరేటర్లు అడుగుతున్నారు. లేని పక్షంలో ఇప్పుడున్న సిమ్ కార్డులను బ్లాక్ చేయాల్సి ఉంటుందని, దాని కారణంగా కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని టెలికాం సంస్థలు పేర్కొంటున్నాయి. పాక్ లో మొబిలింక్, యుఫోన్, టెలినార్, జాంగ్, వారిద్ సంస్థలు టెలికాం సేవలు అందిస్తున్నాయి. దీనిపై చర్చించేందుకు ఈ సంస్థల ప్రతినిధులు పాక్ హోం శాఖ మంత్రి నిస్సార్ అలీ ఖాన్ తో భేటీ కానున్నారు.

  • Loading...

More Telugu News