: ధోనీ విఫలమవుతున్నాడు, కోహ్లీ భావి కెప్టెన్: గంగూలీ
గత కొంతకాలంగా ధోనీ టెస్ట్ మ్యాచ్ లలో జట్టు నుంచి ఉత్తమ ప్రదర్శన రాబట్టడంలో విఫలమవుతున్నాడని మాజీ సారథి సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. అదే సమయంలో విరాట్ కోహ్లీ భావి కెప్టెన్ గా ఆశలు రేపుతున్నాడని పేర్కొన్నారు. ఒక రోజు పోటీలలో ధోనీ రికార్డు అద్భుతమని, ఐదురోజుల పోటీలకు వచ్చేసరికి ఇబ్బందులు పడుతున్నాడని అన్నారు. భారత క్రికెట్ కు భవిష్యత్తు కోహ్లీయేనని గంగూలీ అభివర్ణించారు. వరల్డ్ కప్ వరకూ ధోనీ నాయకత్వంలోనే జట్టు పయనిస్తుందని, ఆపై ఎం జరుగుతుందో వేచి చూడాలని అన్నారు. ఒకవేళ కెప్టెన్సీ మార్పు జరిగితే, కోహ్లీ నాయకత్వంలో ధోనీ ఆడాలని సూచించాడు. సచిన్ కెప్టెన్సీ ముగిసిన అనంతరం తన సారథ్యంలో ఆడాడని గంగూలీ ఈ సందర్భంగా చెప్పాడు. ఇక, తాను కూడా కెప్టెన్సీ పోయిన తర్వాత ద్రావిడ్ కెప్టెన్సీలో ఆడానని, ద్రావిడ్ కూడా ధోనీ కెప్టెన్సీలో ఆడాడని వివరించాడు. అటు, ఆసీస్ దిగ్గజం పాంటింగ్ కూడా కెప్టెన్ గా తప్పుకున్న తర్వాత మైకేల్ క్లార్క్ నాయకత్వంలో ఆడాడని తెలిపాడు.