: 'లాడెన్' తరహాలో దావూద్ ను వేటాడాలి: శివసేన
దావూద్ ఇబ్రహీం ఆచూకీ తెలిసినా కేంద్రం ఇంకా చర్యలకు ఉపక్రమించడం లేదంటోంది శివసేన పార్టీ. అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ను అమెరికా వేటాడిన తరహాలోనే, అండర్ వరల్డ్ డాన్, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు దావూద్ ఇబ్రహీంను పట్టుకునేందుకు భారత్ కూడా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించాలని శివసేన అంటోంది. "కరడుగట్టిన ఉగ్రవాదులైన హఫీజ్ సయీద్, దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ లో రాజకీయ సంరక్షణలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. వారి స్వేచ్ఛా సంచారాన్ని నిరూపించడానికి సాక్ష్యాలు అవసరంలేదు. పాకిస్థాన్ తప్ప మరే దేశం కూడా అలాంటి వ్యక్తులకు ఆశ్రయం కల్పించదు" అని పార్టీ పత్రిక 'సామ్నా' సంపాదకీయంలో అభిప్రాయపడింది. "పరారీలో ఉన్న గ్యాంగ్ స్టర్లను అప్పగించాలని కొన్నేళ్లుగా భారత్, పాకిస్థాన్ ను ఎన్నోసార్లు అభ్యర్థించింది. వారు తమ దేశంలో ఉన్నారన్న విషయాన్ని కూడా పాక్ అంగీకరించ లేదు. ఈ నేపథ్యంలో లాడెన్ విషయంలో అమెరికా వ్యవహరించిన విధంగానే భారత్ కూడా దావూద్ అంశంలో ముందుకెళ్లాలి" అని శివసేన పేర్కొంది.