: ఖమ్మంలో మావోల సంచారం... పోలీసుల కాల్పులతో పరారీ!
తెలంగాణలో నిషేధిత మావోయిస్టుల సంచారం నానాటికీ పెరుగుతోంది. మొన్నటిదాకా పోస్టర్లతో పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన మావోలు తాజాగా గ్రామాల్లో సంచరిస్తూ సవాల్ విసురుతున్నారు. ఖమ్మం జిల్లా పరిధిలో ఇటీవల గిరిజనులపై పోలీసుల కాల్పులకు నిరసనగా మావోలు నేడు జిల్లా బంద్ కు పిలుపునిచ్చారు. బంద్ నేపథ్యంలో తమ ఉనికిని చాటుకునే నిమిత్తం జిల్లాలోని సత్యనారాయణపురం గ్రామానికి వచ్చిన మావోలు అక్కడి సెల్ టవర్ ను పేల్చేసేందుకు యత్నించారు. మావోల సంచారంపై ముందస్తు సమాచారాన్ని సేకరించిన పోలీసులు మావోలపై కాల్పులు జరిపారు. దీంతో సెల్ టవర్ ను పేల్చే యత్నాన్ని విరమించుకున్న మావోలు అక్కడి నుంచి ఉడాయించారు. ఈ ఘటనతో పోలీసు వర్గాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి.