: కేటీఆర్ కు టీఆర్ఎస్ పగ్గాలు?... హరీష్ రావు పరిస్థితి ఏంటి?
టీఆర్ఎస్ పార్టీ పగ్గాలను టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు, మంత్రి కేటీఆర్ అందుకోనున్నారా? హైలెవెల్ పొలిటికల్ సర్కిల్ లో ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తోంది. తండ్రి కేబినెట్ లో ఉన్న కేటీఆర్... త్వరలోనే టీఆర్ఎస్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించబోతున్నారని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. కేటీఆర్ కు పార్టీ బాధ్యతలు అప్పగించడం ద్వారా... తనకు రాష్ట్ర పరిపాలనపై మరింత దృష్టి సారించడానికి వీలు కలుగుతుందని కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం. అంతేకాకుండా, కేటీఆర్ పార్టీ అధ్యక్షుడైతే, భవిష్యత్తులో ఆయనకు పార్టీపై తిరుగులేని ఆధిపత్యం ఉంటుందని కూడా కేసీఆర్ భావిస్తున్నారట. అయితే, టీఆర్ఎస్ పార్టీ పరంగా కాని, ప్రభుత్వ పరంగా కాని, తిరుగులేని మరో నేత హరీష్ రావు. ఇప్పటికే ఆయన వెంట 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, టీఆర్ఎస్ పార్టీ పగ్గాలను కేటీఆర్ కు అప్పగిస్తే, హరీష్ చూస్తూ ఊరుకుంటారా? అనేది మిలియన్ డాలర్స్ క్వశ్చన్. అయితే, దీనికి తగిన ఉపాయం కూడా కేసీఆర్ వద్ద ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హరీష్ కు పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా పూర్తి ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల... భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా చూడాలనేది కేసీఆర్ ఆలోచన అని చెబుతున్నారు.