: కోహ్లీ ఔట్...ఎనిమిదో వికెట్ కోల్పోయిన టీమిండియా
ఆస్ట్రేలియాతో మెల్ బోర్న్ లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ఓ వైపు వరుసగా వికెట్లు పడుతున్నా ఒంటరి పోరు సాగించిన విరాట్ కోహ్లీని ఆసిస్ బౌలర్లు ఎట్టకేలకు పెవిలియన్ చేర్చారు. మొత్తం 272 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 18 బౌండరీలతో 169 పరుగులు చేశాడు. ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయిన స్థితిలో రంగంలోకి దిగిన కోహ్లీ, అజింక్యా రెహానేతో కలిసి భారత్ ను భారీ స్కోరు దిశగా తీసుకెళ్లాడు. రెహానే సహా టీమిండియా బ్యాట్స్ మన్ పెవిలియన్ కు క్యూ కట్టినా, ఒంటరి పోరు సాగించిన కోహ్లీ... మిచెల్ జాన్సన్ బౌలింగ్ లో బ్రాడ్ హాడిన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అదే సమయంలో మూడో రోజు ఆటకు కూడా తెరపడింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 126.2 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన టీమిండియా ఎనిమిది వికెట్లు కోల్పోయి 462 పరుగులు చేసింది. ఆసిస్ కంటే ఇంకా 68 పరుగుల వెనుకంజలో నిలిచింది.