: బెజవాడ మొఘల్రాజపురంలో ఉద్రిక్తత: మాల మహానాడు, ఎమ్మార్పీఎస్ ల మధ్య ఘర్షణ
విజయవాడలోని మొఘల్రాజపురంలో కొద్దిసేపటి క్రితం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాల మహానాడు, ఎమ్మార్పీఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ఎమ్మార్పీఎస్ నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మొఘల్రాజపురంలో మాల మహానాడు కార్యాలయ ప్రారంభోత్సవాన్ని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు అడ్డుకున్న నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మాదిగలు అధికంగా ఉన్న మొఘల్రాజపురంలో మాల మహానాడు కార్యాలయాన్ని ఎలా తెరుస్తారంటూ ఎమ్మార్పీఎస్ నేతలు అడ్డుకున్నారు. తమను అడ్డుకున్న పోలీసులతోనూ ఎమ్మార్పీఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పోలీసులు, ఎమ్మార్పీఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఎట్టకేలకు ఎమ్మార్పీఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది.