: శివాలయంలో ఖురాన్ పఠనం... పంజాబ్ లో వెల్లివిరుస్తున్న మత సామరస్యం!


పంజాబ్ లోని బర్నాలా జిల్లా బదౌర్ లోని శివాలయంలో బుధవారం అరుదైన ఘటన చోటుచేసుకుంది. శివాలయంలో ఖురాన్ పఠనం సాగుతుండగా, ఆలయంలో ఉన్న సాధువులు, సిక్కు మతస్థులు శ్రద్ధగా ఆలకిస్తున్నారు. గడచిన 25 ఏళ్లుగా అక్కడ తరచూ ఇలాంటి ముచ్చట చోటుచేసుకుంటూనే వుంది. అంతేకాదు, ‘గ్యారా రుదార్ శివ మందిర్’ పేరుతో స్థానికులు పిలుచుకునే సదరు శివాలయంలో ఇతర మతస్థులకు ప్రత్యేకంగా ఓ హాలు కూడా ఉంది. మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ ఆలయం దేశంలోని అన్ని ప్రాంతాలు, మతాల ప్రజలకు ఆదర్శంగా నిలుస్తోంది. వివరాల్లోకెళితే... పట్టణానికి చెందిన 20 ఏళ్ల సాకెత్ అలీ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఓ హత్య కేసులో ఇరుక్కున్న అతడి తండ్రి మూడేళ్లుగా జైలులో ఉంటున్నాడు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో అతడి మృతదేహాన్ని ఖననం చేసిన తర్వాత నిర్వహించాల్సిన కర్మకాండ (తొమ్మిదో రోజు ప్రార్థన)లను అతడి తల్లి సొంతంగా నిర్వహించలేని స్థితిలో ఉంది. శివాలయం పాలక మండలికి విషయాన్ని తెలిపింది. శివాలయంలో సాకెత్ కర్మకాండను నిర్వహించుకునేందుకు ఆలయ కమిటీ అనుమతించింది. దీంతో బుధవారం శివాలయంలో ఖురాన్ పఠనం వినిపించింది. శివుడి బొమ్మ ఉన్న బ్యానర్ ముందు కూర్చుని ముస్లిం మత గురువు ఖురాన్ పఠనం చేశారు.

  • Loading...

More Telugu News