: స్కైప్, వైబర్ యూజర్లకు ఎయిర్ టెల్ షాక్
స్కైప్, వైబర్ యాప్స్ కలిగిన యూజర్లకు ఎయిర్ టెల్ షాకిచ్చింది. ఇంటర్నెట్ డేటా ప్యాకేజీ ఉంటే స్కైప్, వైబర్ తదితర యాప్స్ ద్వారా ఉచితంగా కాల్స్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇకపై ఆ సౌకర్యం వినియోగదారులకు అందుబాటులో ఉండదు. ఎందుకంటే, ఇంటర్నెట్ కాల్స్ ను డేటా ప్యాకేజీ నుంచి తొలగిస్తున్నారు. దీంతో ఇంటర్నెట్ కాల్స్ కి అదనంగా బిల్లు వసూలు చేయనున్నారు. ఇది ఇన్ కమింగ్, ఔట్ గోయింగ్ రెండు కాల్స్ కి వర్తిస్తుందని ఎయిర్ టెల్ తెలిపింది. స్కైప్, వైబర్ వెబ్ సైట్ల ద్వారా ఉచిత ఫోన్ కాల్స్ వెసులు బాటు ఉండడంతో పెద్ద సంఖ్యలో ఆ యాప్స్ ను వినియోగిస్తున్నారు. దీనిని ఎయిర్ టెల్ సొమ్ము చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ (వీఓఐపీ)ని ఇంటర్నెట్ డేటా ప్యాకేజీ నుంచి తొలగిస్తున్నట్టు ఎయిర్ టెల్ తమ వెబ్ సైట్ లో పేర్కొంది. త్వరలోనే వీఓఐపీ సేవలతో పాటు ఇంటర్నెట్ డేటా ప్యాక్ లను విడుదల చేస్తామని ఎయిర్ టెల్ వెల్లడించింది.