: ఎన్టీఆర్ ను గద్దె దించడంలో డీజీపీ పాత్ర: కొడాలి నాని
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును చంద్రబాబు నాయుడు గద్దె దించిన ఘటనలో ప్రస్తుత డీజీపీ వెంకటరాముడి పాత్ర ఉందని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు( కొడాలి నాని) ఆరోపించారు. నాడు తనకు సహకరించినందునే వెంటకరాముడికి చంద్రబాబు డీజీపీ పదవిని కట్టబెట్టారని ఆయన అన్నారు. రాష్ట్ర డీజీపీగా వెంకటరాముడి నియామకం చెల్లదని హైకోర్టులో నాని పిటిషన్ దాఖలు చేశారు. ప్రకాశ్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తుంగలో తొక్కుతూ చంద్రబాబు సర్కారు వెంకటరాముడిని డీజీపీగా నియమించిందని నాని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. తక్షణమే వెంకటరాముడిని డీజీపీ పదవి నుంచి తొలగించి, ఆ స్థానంలో వెంకటరాముడి కంటే సీనియర్ ఐపీఎస్ అధికారిని నియమించాలని నాని హైకోర్టును అభ్యర్థించారు. ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా నాడు వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలను ఉంచిన చంద్రబాబు, అప్పుడు నార్త్ జోన్ డీసీపీగా ఉన్న వెంకటరాముడి సహకారం తీసుకుని ఎమ్మెల్యేలను కాపాడుకున్నారన్నారు. 1993లో వెంకటరాముడి పుట్టిన తేదీని సవరించారని, ఈ కారణంగానే ఆయనకు మరో రెండేళ్లపాటు సర్వీసు పెరిగిందని నాని తెలిపారు. ఒక పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న వెంకటరాముడు డీజీపీగా ఉండటం వల్ల రాష్ట్రంలో నిష్పక్షపాత పోలీసింగ్ పై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందని ఆరోపించారు. తక్షణమే వెంకటరాముడిని డీజీపీ పదవి నుంచి తప్పించాలని ఆయన కోర్టును కోరారు.