: నల్లగొండ జిల్లాలో రూ.5.73 కోట్ల బంగారం పట్టివేత
నల్లగొండ జిల్లాలో వాణిజ్య పన్నుల శాఖాధికారులు కొద్దిసేపటి క్రితం భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్న ఈ బంగారం విలువ రూ. 5.73 కోట్లుగా ఉందని అధికారులు తేల్చారు. నల్లగొండ జిల్లా కోదాడ మండలం రామాపురం చెక్ పోస్టు వద్ద వాహనాల తనిఖీలు చేపట్టిన అధికారులు ఈ బంగారాన్ని కనుగొన్నారు. సదరు బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తుల వద్ద కేవలం లక్షల విలువ చేసే బంగారానికి సంబంధించిన బిల్లులు మాత్రమే ఉన్నాయి. దీంతో బంగారం అక్రమ మార్గాల్లోనే తరలుతోందని నిర్ధారించుకున్న అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దానిని హైదరాబాద్ తరలిస్తున్న వ్యక్తులతో పాటు వారి వాహనాన్ని కూడా సీజ్ చేశారు. ఇంత భారీ మొత్తంలో బంగారాన్ని తరలిస్తున్న వైనంపై అధికారులు విచారణ ప్రారంభించారు. పూర్తి వివరాలు రాబట్టేందుకు అధికారులు యత్నిస్తున్నారు.