: తెలంగాణ ఎందుకు అడిగారో మర్చిపోయారా?: వైఎస్సార్సీపీ నేత


టీడీపీ నేతలు సింగపూర్ టెక్నాలజీ అంటూ ఏదో స్వర్గాన్ని తెస్తున్నట్టు చెబుతున్నారు. ప్రపంచంలో ఎన్నో దేశాలకు సాధ్యం కాని టెక్నాలజీ మన సొంతమని, సాక్షాత్తూ అంగారక గ్రహంపైకి ఉపగ్రహాన్ని అత్యల్ప ఖర్చుతో పంపగలిగిన సత్తా భారతీయుల సొంతమని, అలాంటి మనం సింగపూర్ పై ఎందుకు అంతగా ఆధారపడుతున్నామని వైఎస్సార్సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. శాసనసభలో సీఆర్డీఏ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికార పక్షం అద్భుతమైన రీతిలో ప్రజలను నట్టేట ముంచేందుకు ప్రణాళికలు రచించిందని అన్నారు. రాజధాని నిర్మాణం కోసం పని చేసే సంస్థలకు అప్పనంగా స్థలాలు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారని ఆరోపించారు. భారీ స్థాయిలో భూసేకరణ అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. లక్ష ఎకరాల్లో ఏఏ సంస్థలు నిర్మిస్తారని ఆయన నిలదీశారు. గతంలో తెలంగాణ ఉద్యమం రావడం వెనుక కారణం ఏమిటో గుర్తుచేసుకోమని ఆయన అడిగారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎందుకు నష్టపోయిందో గుర్తించారా? అని ఆయన ప్రశ్నించారు. కేవలం రాజధాని ప్రాతిపదికన అభివృద్ధి జరిగిన కారణంగానే ఆంధ్రులు బయటికి తోసి వేయబడ్డారని ఆయన సూచించారు. మరోసారి అలాంటి చారిత్రక తప్పిదం జరగకూడదంటే కేంద్ర కార్యాలయాలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. రాజధాని అనే కారణంగా అన్నీ అక్కడే నెలకొల్పి, అవసరం ఉన్నా లేకున్న లక్షల ఎకరాలు సేకరించి, రైతుల పొట్ట కొట్టవద్దని ఆయన సూచించారు. వీలైనంత తక్కువ భూమిలోనే రాజధాని నిర్మించాలని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News