: నల్ల ధనాన్ని తెచ్చేందుకు ఒంటెలను ఏర్పాటు చేద్దామా?: మోదీపై లాలూ విసుర్లు
విదేశీ ఖాతాల్లో భారతీయులు దాచుకున్న నల్ల ధనాన్ని వెనక్కు తెచ్చేందుకు ఒంటెలను ఏర్పాటు చేయాలా? అని రాష్ట్రీయ జనతా దళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ప్రధాని మోదీని ఎద్దేవా చేశారు. సమాజ్ వాదీ జనతా దళ్ (జనతా పరివార్) ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన తొలి నిరసన కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లాలూ మాట్లాడుతూ "మీరు నల్లధనాన్ని వెనక్కు తెస్తారని మేము ఎదురుచూస్తున్నాం. మరికొన్ని నెలలు వేచి చూడగలం. విమానంలో నల్లధనాన్ని తీసుకురాలేకపోతే మేము ఒంటెలను ఏర్పాటు చేయగలం" అని ఆయన ప్రధానిని ఉద్దేశించి అన్నారు. మంచి రోజులు వస్తాయని ఎప్పుడూ అంటుండే మోదీ మత ప్రాతిపదికన దేశాన్ని విడదీయాలని కృషి చేస్తున్నారని లాలూ విమర్శించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో నేత నితీష్ కుమార్ మాట్లాడుతూ "ప్రజలు బీజేపీకి ఎందుకు ఓటువేశామా అని విచారిస్తున్నారు" అని అన్నారు.