: అతని డిక్షనరీలో కన్నీళ్లకు చోటులేదు... కానీ, ఆ శవాలను చూసి మాత్రం ఏడ్చేశాడు!
అతని డిక్షనరీలో కన్నీళ్లన్న పదానికి తావులేదు. దశాబ్దాలుగా ఆయన ఎంతో మంది దుఃఖాన్ని చూస్తున్నాడు. ఏనాడు ఆయన భావోద్వేగాలకు గురికాలేదు. అతనే కాదు, అతని ఇద్దరు కుమారులు కూడా మృతదేహాలను ఖననం చేయడమే వృత్తిగా ఎంచుకున్నారు. పొట్టకూటి కోసమే శవాలను ఖననం చేస్తున్నా, తానేనాడు బాధ, విచారం వంటి భావోద్వేగాలను ప్రదర్శించలేదు. అయితే, అంతటి ప్రొఫెషనల్ కాటికాపరి మృతదేహాలను ఖననం చేసేటపుడు జీవితంలో ఎన్నడూ ఏడవనంత తీవ్రంగా విలపించాడు. వారితో తనకు ఎలాంటి బంధం లేనప్పటికీ, ఎంతో భవిష్యత్ ఉన్న వారంతా అత్యంత చిన్న వయసులోనే మౌఢ్యానికి, మూర్ఖత్వానికి బలైపోవడం తట్టుకోలేక చలించిపోయాడు. పాకిస్థాన్ లోని పెషావర్ శ్మశానవాటికలో తాజ్ మహమ్మద్ అనే కాటికాపరి చిన్నారుల మృతదేహాలను ఖననం చేస్తూ... 'గతంలో చాలా మంది మృతదేహాలను ఖననం చేశాను. వీరిలో విభిన్న వయసు, ఎత్తు, బరువు ఉన్న వారు ఉన్నారు. అయితే ఉగ్రవాద దాడుల్లో చనిపోయిన చిన్నారుల మృతదేహాలను ఖననం చేస్తున్నప్పుడు చాలా భారంగా అనిపించింది. జీవితంలో తొలిసారి కన్నీళ్లను ఆపుకోలేకపోయాను' అని పేర్కొన్నాడు.