: స్కూల్ లో అందర్నీ చంపేశాం...ఏం చేయమంటారు?: 'పెషావర్ మారణకాండ' ముష్కరులు
పాకిస్థాన్ లోని పెషావర్ లోని ఆర్మీ స్కూల్లో మారణహోమం సృష్టించిన తాలిబన్ ముష్కరులు తమ హ్యాండ్లర్లతో ఏం మాట్లాడారన్న విషయాన్ని డాన్ పత్రిక వెలుగులోకి తెచ్చింది. ''ఆడిటోరియంలో ఉన్న పిల్లలందరినీ చంపేశాం. ఏం చేయమంటారు?'' అని ఓ ఉగ్రవాది వారి హైకమాండ్ ను అడిగగా, ''ఆర్మీవాళ్లు వచ్చేదాకా ఉండండి. వాళ్లని చంపేసి, తర్వాత మిమ్మల్ని మీరు పేల్చుకుని చచ్చిపొండి'' అంటూ అటు నుంచి సమాధానం వినిపించిందని డాన్ పత్రిక తెలిపింది. ఈ విషయం భద్రతాదళానికి చెందిన ఓ అధికారి చెప్పినట్లు పాక్ పత్రిక డాన్ స్పష్టం చేసింది. భద్రతాదళాలు ఉగ్రవాదుల మీద విరుచుకుపడేందుకు కొద్ది నిమిషాల ముందు గోడచాటు నుంచి విన్న మాటలని వారు స్పష్టం చేశారు. దాడులకు పాల్పడినవాళ్లలో ఒకరి పేరు అబుజర్ అని, అతడి కమాండర్ పేరు ఉమర్ అని సైనికులు చెప్పారు. ఉమర్ ఖలీఫా అనే సీనియర్ ఉగ్రవాది, ఫ్రాంటియర్ రీజియన్ పెషావర్ ప్రాంతానికి చెందినవాడని సైనికులు వివరించారు.