: జయలలిత బెయిల్ 2015 ఏప్రిల్ వరకు పొడిగింపు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెయిల్ ను వచ్చే ఏడాది ఏప్రిల్ దాకా పొడిగిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. అక్రమాస్తుల కేసులో జయలలితకు పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.100 కోట్ల జరిమానా విధిస్తూ బెంగళూరులోని ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బెయిల్ కోసం ఆమె దాఖలు చేసుకున్న పిటీషన్ ను కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది. ఆ తర్వాత అక్టోబర్ 17న సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. రెండు నెలల్లోగా కేసు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. తాజాగా నేడు ఈ కేసుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, జయ బెయిల్ ను 2015 ఏప్రిల్ 18 దాకా పొడిగించింది. ఈలోగా జయ అభ్యంతరాలను విచారించేందుకు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేయాలని కర్ణాటక హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక రోజువారీ విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది.