: ఉగ్రవాదాన్ని అంతమొందించే దాకా యుద్ధం కొనసాగుతుంది: నవాజ్ షరీఫ్
నిన్న పెషావర్ లోని సైనిక పాఠశాలపై పాక్ తాలిబన్లు జరిపిన దాడితో పాకిస్థాన్ వణికింది. ఉగ్రవాదుల దాడులను ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండిచారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ, తాలిబన్లలో మంచివారు, చెడ్డవారు అనే తేడా ఏమీ లేదని అన్నారు. దేశం మొత్తం ఒక్క తాటిపై నిలిచి ఉగ్రవాదంపై యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటమే మన లక్ష్యమని ప్రకటించారు. దేశ చరిత్రలో ఇంత ఘోరమైన ఘటన మరొకటి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టెర్రరిస్టులను మట్టుబెట్టే సమయంలో, వారు దాక్కున్న ప్రదేశాలను గుర్తించే క్రమంలో పాక్ సైనికులు అనేక మంది ప్రాణాలను సైతం వదిలారని షరీఫ్ చెప్పారు. దేశంలో ఉగ్రవాదం అంతమయ్యేంత వరకు మన యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే యాక్షన్ ప్లాన్ ను ఇంటెలిజెన్స్ విభాగాలతో కలసి వారంలోగా సిద్ధం చేస్తామని చెప్పారు. ఉగ్రవాదంపై పోరాటానికి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కలసి రావాలని పిలుపునిచ్చారు.