: మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టాం: హోం మంత్రి చినరాజప్ప
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఏపీ డిప్యూటీ సీఎం, హోం మంత్రి చినరాజప్ప తెలిపారు. ఈ రోజు పోలీసు ఉన్నతాధికారులతో ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చత్తీస్ గఢ్, ఒడిశా సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరింపజేశామని చెప్పారు. రాష్ట్రంలో 24 పోలీస్ స్టేషన్ల నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు. ఏపీలో ఇకపై బాణాసంచా తయారీ చేయాలంటే జిల్లా కలెక్టర్, ఎస్పీల అనుమతి తప్పనిసరి అని చెప్పారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్టు వెల్లడించారు.