: స్పైస్ జెట్ పై పోలీసులకు అయ్యప్ప భక్తుల ఫిర్యాదు
అప్పుల ఊబిలో కూరుకుపోయి నేటి ఉదయం సర్వీసులను నిలిపివేసిన స్పైస్ జెట్ పై అయ్యప్ప భక్తులు ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. ముందు చెప్పకుండా చివరి నిమిషంలో విమాన సర్వీసులను రద్దు చేస్తే ఎలాగంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ శబరి యాత్రను అయోమయంలో పడేసిన స్పైస్ జెట్ యాజమాన్యంపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే... అయ్యప్ప మాలలు వేసుకున్న కొందరు తెలుగు భక్తులు శబరి యాత్రకు వెళ్లేందుకు నెలన్నర క్రితమే టికెట్లు బుక్ చేసుకున్నారు. యాత్రలో భాగంగా కొందరు నేటి ఉదయం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. మరికొందరు విమానాశ్రయానికి వచ్చేందుకు సిద్ధపడుతున్నారు. ఇంతలోనే వారు ప్రయాణించాల్సిన కోచి విమానం రద్దైనట్లు సమాచారం అందింది. చివరి నిమిషంలో విమానం రద్దు కావడంతో ఏం చేయాలో పాలుపోని అయ్యప్ప భక్తులు స్పైస్ జెట్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెనువెంటనే శబరి చేరుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే పనిలో పడిపోయారు.