: మమత పేరు చెప్పమని సీబీఐ ఒత్తిడి చేస్తోంది: అరెస్టైన వెస్ట్ బెంగాల్ మంత్రి
శారదా చిట్ ఫండ్ కుంభకోణంలో అరెస్టైన పశ్చిమ బెంగాల్ రవాణా శాఖ మంత్రి మదన్ మిత్రా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఫోన్ కాల్ తోనే తనను సీబీఐ అరెస్ట్ చేసిందని ప్రకటించిన ఆయన, తాజాగా సీబీఐ దర్యాప్తు జరుపుతున్న తీరుపై మంగళవారం కీలక ఆరోపణలు చేశారు. కుంభకోణంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రికి పాత్ర ఉందని చెప్పాలంటూ సీబీఐ అధికారులు తనపై ఒత్తిడి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఐదు రోజులుగా తనను విచారిస్తున్న సీబీఐ అధికారులు ఒక్కటంటే ఒక్క ప్రశ్న కూడా తనను అడగలేదని చెప్పిన ఆయన, 24 గంటల పాటు తన చుట్టూ నిలబడుతున్న సీబీఐ అధికారులు తనను ఒత్తిడికి లోను చేస్తున్నారని ఆయన చెప్పారు. కుంభకోణంలో తన పార్టీ నేతల ప్రమేయం ఉందని చెప్పాలని బలవంతపెడుతున్న సీబీఐ అధికారులు, మమతా బెనర్జీకీ ఇందులో పాత్ర ఉందని చెప్పాలంటూ ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. మంగళవారం అలీపూర్ కోర్టుకు వచ్చిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.