: హుదూద్ కు కేంద్ర సాయం రూ.840 కోట్లే!
ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసిన హుదూద్ తుపాను నుంచి కోలుకునేందుకు ఏపీకి రూ.840 కోట్ల సాయాన్ని అందించేందుకు కేంద్రం అంగీకరించింది. పెను విలయం సృష్టించిన హుదూద్, విశాఖకు గతంలో ఎన్నడూలేనంత భారీ నష్టాన్ని మిగిల్చింది. ఈ నేపథ్యంలో నాడు విశాఖను సందర్శించిన సందర్భంగా రూ.1000 కోట్ల మేర తక్షణ సాయాన్ని అందించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అయితే ఇప్పటిదాకా కేంద్రం నుంచి కేవలం రూ.400 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. ఇంకో రూ.440 కోట్లను మాత్రమే విడుదల చేయగలమని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. విపత్తు నిధి నిబంధనల మేరకు ఈ సాయాన్ని అందించనున్నట్లు సోమవారం తనను కలిసిన ఏపీ పునరావాస కమిషనర్ సుకుమార్ కు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి తేల్చిచెప్పారు. ఇక ఏపీ సర్కారు శాఖల వారీగా కోరిన నిధులను ఏకమొత్తంగా విడుదల చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసిన గోస్వామి, ఆయా శాఖలను సంప్రదించి నిధులను విడుదల చేయించుకోవాలని సూచించారు.