: కొప్పుల దారికొచ్చారు... అనుచరులే శాంతించట్లేదు!
మంత్రి పదవి విషయంలో టీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ కాస్త శాంతించారు. అయితే ఆయన అనుచరులైన మాల మహానాడు నేతలు, కార్యకర్తల ఆగ్రహావేశాలు మాత్రం చల్లారలేదు. సీనియర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న తనకు మంత్రి పదవి దక్కుతుందన్న అపార విశ్వాసంతో ఉన్న కొప్పులకు ఆదివారం సీఎం కేసీఆర్ షాకిచ్చారు. అసెంబ్లీలో చీఫ్ విప్ గా ఆయనను ప్రకటించి, ఇక మంత్రి పదవిపై ఆశలు వదులుకోవాలని పరోక్షంగా చెప్పారు. అయితే నిన్నటిదాకా మంత్రి పదవి ఇస్తానని ఊరించిన కేసీఆర్ రాత్రికి రాత్రి ప్లేటు ఫిరాయించడంపై కొప్పుల భగ్గుమన్నారు. చీఫ్ విప్ పదవి అక్కర్లేదు...ఎమ్మెల్యేగానే కొనసాగుతానంటూ అలకపాన్పెక్కారు. అయితే సోమవారం ఉదయం రంగంలోకి దిగిన అధిష్ఠానం కొప్పులను ఎలాగోలా బుజ్జగించింది. దాంతో ఆయన అధిష్ఠానం మాట జవదాటనని ప్రకటించారు. అయితే ఆయన అనుచరులు మాత్రం కొప్పులకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ డిమాండ్ తో కొద్దిసేపటి క్రితం తెలంగాణ భవన్ వద్దకు వచ్చిన మాల మహానాడు కార్యకర్తలు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అంతేకాక కొప్పులకు మంత్రి పదవి ప్రకటించేదాకా అక్కడి నుంచి కదిలేదిలేదని భీష్మించారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు మాల మహానాడు కార్యకర్తలను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.