: పేదలను బలి తీసుకుంటున్న వైద్య ప్రయోగాలు
వ్యాధులకు విరుగుడుగా కనిపెట్టే ఔషధాలను ముందుగా అనేకమార్లు పరీక్షిస్తారు. తొలుత జంతువులపై, తర్వాత మనుషులపై ప్రయోగించి, ఆ ఫలితాల ఆధారంగా దాని సామర్థ్యంపై ఓ నిర్ణయానికొస్తారు. ఈ క్రమంలో, ఎందరో పేదలు బలై పోతున్నారని న్యాయస్థానాలు హెచ్చరిస్తున్నా, పరిస్థితిలో మార్పు రావడంలేదు. డబ్బు కోసం ఆశపడి ఈ క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొనే పేదలు పలు సందర్భాల్లో ప్రాణాలు విడుస్తున్నారు. 2013 ఫిబ్రవరి నుంచి దేశంలో ఇప్పటివరకు 370 మంది ఈ ఔషధ పరీక్షల కారణంగా కన్నుమూశారు. వీటిపై 222 కేసులు నమోదు కాగా, వాటిలో 21 ఘటనల్లోనే వ్యక్తులు మందుల కారణంగా మృతి చెందినట్టు విచారణ కమిటీ నిర్ధారించింది. అయితే, దీనిపై కొందరు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. విచారణ విధానం లోపభూయిష్టమని, మార్పులు చేయాలని కోరుతున్నారు.