: క్రిస్ మస్ పర్వదినాన పాఠశాలల్లో సుపరిపాలన దినోత్సవం
నిజమే. క్రిస్ మస్ పర్వదినాన పాఠశాలల్లో సుపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్రిస్ మస్ కు, సుపరిపాలనకు ఏమిటీ సంబంధమనేగా మీ డౌటు? డిసెంబర్ 25... క్రిస్ మస్ రోజు క్రైస్తవుల ఆరాధ్య దైవం యేసుక్రీస్తు పుట్టిన రోజని ప్రపంచానికి తెలుసు. భారత మాజీ ప్రధాని, బీజేపీ సీనియర్ నేత, మచ్చలేని రాజకీయవేత్త అటల్ బిహారీ వాజ్ పేయి కూడా డిసెంబర్ 25నే జన్మించారు. వాజ్ పేయితో పాటు స్వాతంత్ర్య సమరయోధుడు, హిందూ మహాసభ నేత పండిట్ మదన్ మోహన్ మాలవీయ జన్మదినం కూడా డిసెంబర్ 25. ఈ నేపథ్యంలోనే మచ్చలేని పాలనను అందించిన అటల్ జీ గౌరవార్థం క్రిస్ మస్ రోజున సుపరిపాలన దినాన్ని పాటించాలని కేంద్రం తీర్మానించింది. దీంతో నవోదయ పాఠశాలలకు డిసెంబర్ 25న సెలవు రద్దైంది. అంతేకాక సీబీఎస్ఈ పాఠశాలలకు కూడా సెలవును రద్దు చేయాలని కేంద్రం భావిస్తున్నా, దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. డిసెంబర్ 25 సుపరిపాలన దినాన్ని పురస్కరించుకుని నవోదయ, సీబీఎస్ఈ విద్యార్థులకు వ్యాసరచనతో పాటు పలు రకాల పోటీలను నిర్వహించేందుకు కేంద్రం తీర్మానించింది.