: రాజకీయ పరిజ్ఞానం కోసం రామాయణం, మహాభారతాలను చదవండి: అద్వానీ
బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ ఆదివారం దేశ ప్రజలకు సరికొత్త సూచన చేశారు. రాజకీయ పరిజ్ఞానం కోసం రామాయణం, మహాభారత గ్రంధాలను చదవాలని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయ పరిజ్ఞానమే కాక సత్ప్రవర్తనపై కూడా ఆ గ్రంధాల పఠనం వల్ల అవగాహన కలుగుతుందని ఆయన అన్నారు. ఈ విషయంలో ఈ గ్రంధాలను మించిన పుస్తకాలు లేవని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ‘‘బోధన శాస్త్రంలో మహాభారత గ్రంధాన్ని మించిన పుస్తకమేదీ లేదని విశ్వసిస్తాను. రాజకీయాలపై అందులో అపార సమాచారం ఉంది. అంతేకాక సత్ప్రవర్తనను కూడా ఆ గ్రంధం బోధిస్తుంది. ఐక్యత, ధైర్యాన్ని కూడా మహాభారత పఠనం మనలో పెంపొందిస్తుంది’’ అని ఆయన అన్నారు. ప్రముఖ జర్నలిస్టు కె.నరేంద్ర శత జయంతి వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా అద్వానీ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశానికి స్వతంత్రం రాకముందు మహాభారతంతో పాటు రామాయణాన్ని ఆంగ్లం, సింధీ భాషల్లో చదివానని చెప్పిన ఆయన, స్వతంత్ర్యానంతరమే ఆ గ్రంధాలను హిందీలో చదివానని పేర్కొన్నారు.