: అచ్చం 'కన్యాదానం' సినిమాలోలా జరిగిందక్కడ!
శ్రీకాంత్, ఉపేంద్ర నటించిన 'కన్యాదానం' సినిమా గుర్తుందా? అచ్చం ఆ సినిమాలోలానే జరిగింది. తాను పెళ్లాడిన యువతి వేరే యువకుడ్ని ఇష్టపడుతోందని తెలియడంతో అతనిని రప్పించి పెళ్లి చేసి, తన గొప్ప మనసు చాటుకున్నాడో యువకుడు. వివరాల్లోకి వెళితే... తమిళనాడు లోని తిరుచ్చి జిల్లా తురైయూరు సమీపంలోని ఉప్పిలియాపురం గ్రామానికి చెందిన దేవి అనే యువతితో నందకుమార్ (26)కు పెద్దలు అట్టహాసంగా వివాహం జరిపించారు. వరుడి ఇంటికి వచ్చిన యువతి గురువారం రాత్రి శోభనం సమయంలో నందకుమార్ కాళ్లపై పడి భోరున విలపించింది. తన తల్లిదండ్రులు చేసిన నిర్వాకాన్ని అతడికి వివరించింది. 'తాను ప్రేమించిన లారీ డ్రైవర్ తోనే తన జీవితం' అంటూ తేల్చి చెప్పింది. దీంతో నందకుమార్ అతనిని పిలిపించి. తురైయూరు పెరుమాళ్ ఆలయంలో వివాహం జరిపించాడు. ఆమెతో కాపురం చేసి తన జీవితాన్ని నరకం చేసుకునే కంటే అతని వద్దకే పంపించి తన పెద్దమనసును చాటుకున్నాడు నందకుమార్.