: కూతురి వాట్సప్ మెసేజ్ చూసి...డ్రగ్ పెడ్లర్ ను పట్టిచ్చిన తల్లి


కన్నవారిపై ఓ కన్నేసి ఉంచడం ఎంత ముఖ్యమో తెలియజేసే సంఘటన ముంబైలో చోటు చేసుకుంది. ముంబైలో డ్రగ్స్ కు బానిసలుగా ఆడామగా తేడా లేకుండా యువతరం మారుతోంది. దీంతో డ్రగ్ మాఫియాను అణచివేయడం పోలీసులకు సవాలుగా మారింది. కుమార్తె సెల్ పై కన్నేసిన ఓ తల్లి, బంగారంలాంటి కుమార్తె భవిష్యత్ ను కాపాడి, డ్రగ్ పెడ్లర్ ను పోలీసులకు పట్టించింది. ముంబైకి చెందిన 16 ఏళ్ల యువతి స్థానిక కళాశాలలో చదువుతోంది. ఆమె స్నానానికి బాత్రూంకి వెల్లిన సమయంలో సెల్ ఫోన్లో వాట్సప్ మెసేజ్ లు వస్తున్నట్లు పదే పదే మోగడంతో యువతి తల్లి వాటిని చూసింది. మెసేజ్ లను చూసిన తల్లి నోటమాటరాక షాక్ కు గురైంది. రఘిబ్ అనే వ్యక్తి పంపిన మెసేజ్ లు అవి. అంధేరి ప్రాంతంలో తనను కలిస్తే మెత్, ఎండీ, మారిజువానా లాంటి డ్రగ్స్ ఇస్తానని ఆ మెసేజ్ ల సారాంశం. దీంతో ఆ తల్లి క్షణం కూడా ఆలోచించకుండా మహిళా వికాస్ సమితి అనే ఎన్జీవో నిర్వాహకురాలు నీదా రషీద్ ను సంప్రదించారు. ఆమె పోలీసులను సంప్రదించి యువతిని అనుసరిస్తూ డ్రగ్ పెడ్లర్ ను పట్టుకున్నారు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ యువతికి రఘీబ్ ఫేస్ బుక్ ద్వారా పరిచయమయ్యాడు. నెంబర్లు ఇచ్చి పుచ్చుకుని వాట్సప్ ద్వారా వారిద్దరూ ఛాటింగ్ మొదలుపెట్టారు. తరువాత ఆమె మూడుసార్లు అతడి నుంచి డ్రగ్స్ తీసుకుంది. తాను డ్రగ్స్ రుచి చూడడమే కాకుండా ఆ ఘనకార్యం తన స్నేహితులతో కూడా చేయించిందా యువతి. వారికి కూడా డ్రగ్స్ కావాలని అతనిని అడగడంతో రఘీబ్ లక్ష రూపాయలు ఖర్చవుతుందని తెలిపాడు. అంత డబ్బు తన దగ్గర లేదని వారు చెప్పడంతో ముగ్గురూ తనతో గడపాలని అలా గడిపితే ఫ్రీగా ఇస్తానని ప్రతిపాదించాడని పోలీసులు తెలిపారు. తరువాత డబ్బుకే బేరం కుదిరినప్పటికీ డ్రగ్ పెడ్లర్ దొరికాడు తప్ప రఘీబ్ మాత్రం దొరకకపోవడం విశేషం.

  • Loading...

More Telugu News