: మీ చెంచాలను, జోకర్లను కట్టడి చేయండి: అసదుద్దీన్ ఒవైసీ
నిన్నటి వరకు మతమార్పిడులు వద్దు, హిందూత్వం చచ్చిపోతుంది అంటూ గగ్గోలు పెట్టిన భజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ లు ఆగ్రాలో మత మార్పిడులకు ఎలా పాల్పడతారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మత మార్పిడులపై జరిగిన చర్చ సందర్భంగా లోక్ సభలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ చెంచాలు, శాఖలు అయిన జోకర్లను కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. భజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ సాక్షాత్తూ మత మార్పిడులకు పాల్పడుతుంటే కేంద్రంలోని నేతలు తాను భజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ కు చెందిన వారమని ఎలా చెప్పుకుంటారని, అలా చెప్పుకోవడం వల్ల ఏ సందేశం ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు దేవుడ్ని కొలిచే స్వేచ్ఛ లేనప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నామని ఎలా భావించాలని ఆయన ప్రశ్నించారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. బీజేపీ సభ్యులు ఆయన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇతర మతాలపై బీజేపీ ఏ వ్యాఖ్యలు చేసినా పర్లేదు, ఇతరులు మాత్రం ఏ వ్యాఖ్యలు చేయకూడదంటే ఎలా? అని ప్రతిపక్షాలు నినాదాలు చేశాయి.