: ఢిల్లీలో లష్కరే దాడులు జరగొచ్చు: భారత్ కు అమెరికా హెచ్చరిక
పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తోయిబా ఢిల్లీలో దాడులకు దిగే ప్రమాదముందని భారత్ ను అమెరికా హెచ్చరించింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇంటెలిజెన్స్ అధికారులతో కలిసి ఢిల్లీ పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దాడులు జరిగే అవకాశాలున్నాయని చెప్పిన అమెరికా నిఘా వర్గాలు... ఏ ప్రాంతంలో, ఏ సమయంలో అన్న విషయాలపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రాలు హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్టాల పోలీసులతో ఢిల్లీ పోలీసులు సమన్వయంగా ఉగ్రవాద దాడులకు కళ్లెం వేసేందుకు రంగంలోకి దిగారు. ఈ విషయంలో ఏ చిన్న అవకాశాన్ని వదలకూడదని భావిస్తున్న పోలీసులు నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. వచ్చే నెలలో జరగనున్న రిపబ్లిక్ దినోత్సవాలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాద దాడులు జరిగే అవకాశాలున్నాయంటూ ఆ దేశం నుంచి హెచ్చరికలు రావడంతో కేంద్ర హోం శాఖ కూడా ఈ విషయాన్ని సీరియస్ గానే పరిగణిస్తోంది.