: దుర్గ గుడిలో పూజారుల చేతివాటం... ఇద్దరు పూజారుల తొలగింపు
విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో పూజారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. భవానీ దీక్షల సందర్భంగా నేడు దుర్గ గుడి భక్తులతో పోటెత్తుతోంది. భారీగా తరలివస్తున్న భక్తులకు పూజాదికాల నిర్వహణ కోసం ఆలయ అధికారులు 150 మంది పూజారులను కాంట్రాక్టు పద్ధతిన నియమించుకున్నారు. ఇలా నియమితులైన పూజారులు భవానీ దీక్షలు విరమిస్తున్న సందర్భంగా భక్తులు అమ్మవారికి సమర్పించేందుకు తీసుకొచ్చిన నగదుతో పాటు నగలను కూడా జేబుల్లో వేసుకుంటున్నారు. ఓ ప్రైవేట్ ఛానల్ ఈ వ్యవహారాలను తన కెమెరాల్లో బంధించింది. ఈ నెల 16 దాకా లక్షలాది మంది భక్తులు భవానీ దీక్షలను విరమించనున్నారు. దీనిని అవకాశంగా తీసుకుని చేతికందినంత దండుకునేందుకు కాంట్రాక్టు పూజారులు రంగంలోకి దిగారు. అయితే వారి చేతివాటం వెలుగు చూడటంతో అధికారులు ఇద్దరు పూజారులను విధుల్లో నుంచి తప్పించారు.