: నేడు రజనీ బర్త్ డే...2 వేల థియేటర్లలో లింగా విడుదల!
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నేడు 65 జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన తాజా చిత్రం 'లింగా' ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. దాదాపు రెండు వేలకు పైగా థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీసు రికార్డులను బద్దలుకొడుతుందన్న అంచనాలున్నాయి. రజనీ జన్మదినం, లింగా విడుదల నేపథ్యంలో తమిళనాట రజనీ అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. లింగా చిత్రం కథ తమదేనంటూ పలువురు వ్యక్తులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ చిత్రానికి మరింత ప్రచారం లభించినట్లైంది. చిత్రాన్ని నిలుపుదల చేయాలన్న పిటిషన్లను తొసిపుచ్చిన హైకోర్టు, రూ.10 కోట్లను డిపాజిట్ చేయాలని చిత్ర నిర్మాత రాక్ లైన్ వెంకటేశ్ కు సూచించింది. అయితే ప్రస్తుతానికి రూ.3 కోట్లను కోర్టుకు సమర్పించిన వెంకటేశ్, మిగతా రూ.7 కోట్లను సోమవారం అందజేయనున్నట్లు తెలిపారు. దీనికి కోర్టు కూడా సమ్మతించడంతో మరికొద్దిసేపట్లో లింగా ప్రేక్షకుల ముందుకు రానుంది.