: ఈ పోస్టాఫీసు నుంచి ఉత్తరాలు ఎక్కడికెళతాయో తెలుసా?
మొబైల్ విప్లవం రాకముందు సమాచార మార్పిడికి ఉత్తరాలే ప్రజలకు ప్రధాన సాధనంగా ఉండేవి. కాలగమనంలో సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ ప్రవేశించడంతో సామాజిక జీవనం మార్పులకు లోనైంది. ఉద్యోగాలకు సంబంధించినవి, బ్యాంకులు, ఇతర కార్యాలయాలకు చెందిన లేఖలే ఇప్పుడు అధికంగా బట్వాడా అవుతున్నాయి. క్షేమ సమాచారాలతో కూడిన లేఖలు దాదాపుగా లేనట్టే! ఆ విషయం వదిలిస్తే... అప్పుడూ ఇప్పుడూ పోస్టాఫీసు నిర్వచనంలో మార్పులేదు. ఉత్తర ప్రత్యుత్తరాలకు వారధి అని భావించవచ్చు. ఈ పోస్టాఫీసు కూడా అలాంటిదే. అయితే, ఇది భక్తులకు, భగవంతునికి మధ్య వారధి వంటిది. కేరళలోని శబరిమలలో ఉంది. ఈ తపాలా కార్యాలయం నుంచి ఉత్తరాలను అయ్యప్ప స్వామికే బట్వాడా చేస్తారు. అయ్యప్ప భక్తుల కోసం ఉద్దేశించబడిన ప్రత్యేక తపాలా కార్యాలయం ఇది. అయ్యప్ప దీక్షా కాలంలోనే ఇది తెరుచుకుంటుంది. దీక్షా కాలం ముగియడంతో ఇది కూడా మూతపడుతుంది. వారంలో 6 రోజులు పనిచేసే ఈ పోస్టాఫీసులో ఆరుగురు ఉద్యోగులు ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు పనిచేస్తారు. వారికి హెడ్ సాయి ప్రకాశ్ అనే యువకుడు. ఈ పోస్టాఫీసు గురించి ప్రకాశ్ మాట్లాడుతూ, ఇక్కడికి అధికంగా వివాహ ఆహ్వాన పత్రికలు, షాపు ఓపెనింగ్ ఇన్విటేషన్లు వస్తుంటాయని, అన్నీ అయ్యప్ప స్వామి అడ్రస్ కే వస్తుంటాయని తెలిపాడు. లేఖలు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువగా వస్తుంటాయని వివరించాడు. ఆలయ ప్రాంగణంలో 3 పోస్టు బాక్సులు ఉంచామని, వాటిలో ఐడీ కార్డులు, వాలెట్లు కూడా దర్శనమిస్తుంటాయన్నాడు. కాగా, ఆ ఐడీ కార్డులు, వ్యాలెట్లను జేబుదొంగలే పోస్ట్ బాక్సుల్లో వేస్తుంటారని పోలీసులు తెలిపారు. జేబులు కొట్టిన తర్వాత పర్సుల్లోని డబ్బు తీసుకుని, మిగిలిన వాటిని ఈ పోస్టు బాక్సుల్లో వేస్తుంటారని వివరించారు.