: తొలి టెస్ట్ మూడో రోజు ఆట ప్రారంభం...వికెట్ నష్టానికి టీమిండియా స్కోరు 82
బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ ల మధ్య అడిలైడ్ లో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఉన్న 517/7 స్కోరుతోనేే ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. దీంతో మూడో రోజు వచ్చీ రాగానే టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించేసింది. అయితే ఆదిలోనే తడబడిన టీమిండియా, 30 పరుగుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (25) ను ఆసిస్ బౌలర్ ర్యాన్ హ్యారిస్ పెవిలియన్ చేర్చాడు. దీంతో కాస్త తొట్రుపాటుకు గురైన టీమిండియా ఆ తర్వాత నెమ్మదిగానే అయినా నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. ప్రస్తుతం 20 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ ను కోల్పోయి, 82 పరుగులు చేసింది. ఓపెనర్ గా బరిలోకి దిగిన మురళీ విజయ్ (36) కి ఛటేశ్వర్ పుజారా (17) జత కలిశాడు.