: స్వాత్ లోయ ఎంతో అందమైనది...ఇప్పుడు తీవ్రవాదుల స్థావరమైంది: మలాలా


పాకిస్థాన్ లో తన ప్రాంతమైన స్వాత్ లోయ ఎంతో అందమైన పర్యాటక ప్రాంతమని నోబెల్ పురస్కారగ్రహీత మలాలా యూసుఫ్ జాయ్ పేర్కొన్నారు. ఒస్లోలో ఆమె మాట్లాడుతూ, అంత అందమైన స్వాత్ లోయ తీవ్రవాదుల స్థావరమైపోయిందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ సమాన హక్కులుండాలని ఆమె ఆకాంక్షించారు. జీవితాలను ప్రభావితం చేసే పుస్తకాల కంటే సులువుగా ప్రాణాలు హరించే తుపాకులు దొరకడం శోచనీయమని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రపంచం విద్య ఆవశ్యకతను గుర్తించాలని ఆమె పిలుపునిచ్చారు. తన తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఇస్లాంకు తప్పుడు భాష్యాలు చెప్పి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నోబెల్ పురస్కారం ద్వారా వచ్చిన మొత్తాన్ని మలాలా ఫౌండేషన్ కు అందజేస్తున్నానని ఆమె పేర్కొన్నారు. బాల్య వివాహాలు అంతరించిపోవాలని ఆమె ఆకాంక్షించారు. దేశంలో ఉన్న ప్రతి చిన్నారికీ నాణ్యమైన విద్య అందాలని ఆమె పిలుపునిచ్చారు. తమ ఊర్లో ఇప్పటికీ స్కూలు లేదని ఆమె తెలిపారు. తనలాంటి బాలలంతా ఇప్పుడు విద్యను కోరుకుంటున్నారని ఆమె వెల్లడించారు.

  • Loading...

More Telugu News