: కార్గిల్ వార్ ఎందుకు జరిగిందో చెప్పిన ముషారఫ్
పాకిస్థాన్ మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్ మరోసారి తెరపైకి వచ్చారు. కార్గిల్ యుద్ధం ఎందుకు జరిగిందో వివరించారు. 'కుక్క కాటుకు చెప్పు' దెబ్బ తరహాలోనే కార్గిల్ పోరాటం చోటు చేసుకుందని అన్నారు. బంగ్లాదేశ్ ఏర్పాటులో భారత్ కీలక పాత్ర పోషించిందని, అందుకు ప్రతీకారంగానే కార్గిల్ వార్ జరిగిందని వెల్లడించారు. కరాచీలో ఓ టీవీ చానల్ తో మాట్లాడుతూ, బంగ్లాదేశ్ ఆవిర్భావంలో పాత్ర పోషించడమే కాకుండా, సియాచిన్ పై పట్టుకు పాకులాడుతోందని అన్నారు. ఇలాంటివి అనేక చర్యలే కార్గిల్ పోరుకు దారి తీశాయని పేర్కొన్నారు. భారత్ తో ప్రతి అంశంలోనూ 'కుక్క కాటుకు చెప్పు దెబ్బ' తరహాలోనే వ్యవహరించాలని తాను నమ్ముతున్నట్టు చెప్పారు. అన్నట్టు, 1999లో కార్గిల్ యుద్ధం జరిగిన సమయంలో పాక్ ఆర్మీకి చీఫ్ గా వ్యవహరించింది ముషారఫ్ మహాశయుడే. ఇక, భారత్ తో సంబంధాలపైనా ఆయన తన అభిప్రాయాలు వెల్లడించారు. చర్చల అంశంలో భారత్ ఒక్క అడుగు ముందుకేస్తే, పాకిస్థాన్ రెండడుగులు ముందుకేస్తుందని అన్నారు. భారత్ తో పాక్ చెలిమి సమాన హక్కుల ప్రాతిపదికనే సాధ్యమవుతుందని సెలవిచ్చాడీ మాజీ అధ్యక్షుడు. "ప్రజలు నేను భారత్ తో మైత్రికి వ్యతిరేకమని భావిస్తారు. కానీ, అది తప్పు. నా హయాంలో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఉండేవి. కాశ్మీర్, సర్ క్రీక్, నీటి ఒడంబడిక వంటి అంశాలు పరిష్కారం ముంగిట నిలిచాయి" అని పేర్కొన్నారు. భారత్ ను నరేంద్ర మోదీ సర్కారు పాలిస్తున్నా రెండు దేశాల మధ్య చెలిమి సాధ్యమేనని అన్నారు. కానీ, భారత్ దూకుడు ప్రదర్శిస్తే, తాము కూడా అదే రీతిలో స్పందిస్తామని కటువుగా వ్యాఖ్యానించారు.