: అధికారాలన్నీ మోదీ తన వద్దే ఉంచుకున్నారు: రాహుల్ ఆరోపణ
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ధ్వజమెత్తారు. అధికారాలన్నీ మోదీ తన వద్దే ఉంచుకున్నారని ఆరోపించారు. వాజ్ పేయి సహా ఇంతక్రితం పాలించిన వారెవరూ ఇలా వ్యవహరించలేదని విమర్శించారు. ఎవరితోనూ చర్చించకుండానే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని మోదీపై రాహుల్ మండిపడ్డారు. తిరువనంతపురంలో ఆయన మాట్లాడుతూ, "బీజేపీలో మోదీ ఒక్కరే మాట్లాడతారు. ఆయనే నిర్ణయాలు తీసుకుంటారు. ఇది బీజేపీ ప్రభుత్వంలా లేదు, మోదీ సర్కారులా ఉంది. అది కూడా మూణ్నాలుగు కార్పొరేట్ సంస్థల కోసం పనిచేస్తున్నట్టుగా ఉంది. దీనంతటికీ కారణం మోదీయే. వాజ్ పేయి సర్కారుతోనూ మాకు సమస్యలుండేవి. వారి సిద్ధాంతాలతో మేం ఏకీభవించలేదు. కానీ, వాజ్ పేయి తన సహచరులు చెప్పింది వినేవారు. ఇప్పుడు ఎవరూ నోరెత్తే పరిస్థితి లేదు, మమ్మల్ని కూడా పార్లమెంటులో మాట్లాడొద్దంటున్నారు" అని అన్నారు.