: కప్పట్రాళ్ల హత్య కేసులో 21 మందికి జీవిత ఖైదు


తెలుగుదేశం పార్టీ నేత కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు హత్య కేసులో 21 మందికి జీవిత ఖైదు విధిస్తూ ఆదోని సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది. 2008లో జరిగిన వెంకటప్పనాయుడి హత్య కేసులో సుదీర్ఘంగా కొనసాగిన విచారణ ఎట్టకేలకు నేడు పూర్తయింది. కొద్దిసేపటి క్రితం కోర్టు తుది తీర్పును వెలువరించింది. కప్పట్రాళ్ల హత్య కేసు తుది తీర్పు నేపథ్యంలో ఆదోని సహా, కప్పట్రాళ్లలోనూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2008 మే 17న నమోదైన ఈ కేసులో మొత్తం 46 మంది నిందితులుగా ఉన్నారు. వీరిలో నలుగురిని కప్పట్రాళ్ల వర్గీయులు హతమార్చగా, అనారోగ్యం కారణంగా మరో ముగ్గురు సబ్ జైలులో ఉండగానే మరణించారు. ఇక కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న దివాకర్ నాయుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో ఆయన సుదీర్ఘ కాలంగా కోర్టు వాయిదాలకు కూడా హాజరుకావడం లేదు. దీంతో నేడు తీర్పు సందర్భంగా 38 మంది నిందితులు కోర్టుకు హాజరయ్యారు. మొత్తం 46 మంది నిందితుల్లో 21 మందిని దోషులుగా ప్రకటించిన కోర్టు జీవిత ఖైదు విధించింది. జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ.1,000 జరిమానాను విధించింది. జీవిత ఖైదు పడ్డవారిలో ముగ్గురు ఇప్పటికే మరణించగా, ప్రధాన నిందితుడు దివాకర్ నాయుడు పరారీలో ఉన్నారు. దీంతో కోర్టు తీర్పు ఆధారంగా ఈ నలుగురు మినహా మిగిలిన 17 మందిని పోలీసులు జైలుకు తరలించనున్నారు.

  • Loading...

More Telugu News