: ఇక దేశవ్యాప్తంగా బాబా రాందేవ్ ‘ఆచార్య కులం’ విద్యాలయాలు!
విఖ్యాత యోగా గురువు బాబా రాందేవ్ నేతృత్వంలో ‘ఆచార్య కులం’ పేరిట కొత్తగా ఏర్పాటు కానున్న విద్యాలయాలు ఇకపై దేశవ్యాప్తంగా విస్తరించనున్నాయి. దేశంలోని ప్రతి మూలలో ఈ తరహా విద్యాలయాలను ఏర్పాటు చేసేందుకు బాబా రాందేవ్ చర్యలు ప్రారంభించారు. ఇందుకోసం ఆసక్తి గల సంస్థలు, వ్యక్తుల నుంచి ప్రతిపాదనలను కోరుతూ ఆయన ప్రకటన విడుదల చేశారు. తొలిదశలో దేశవ్యాప్తంగా 500 విద్యాలయాలను ఏర్పాటు చేయాలని ఆయన భావిస్తున్నారు. ఇప్పటికే యోగా తరగతుల కోసం బాబా రాందేవ్ ‘పతంజలి యోగపీఠం’ పేరిట నిర్వహిస్తున్న యోగా కేంద్రాలు దేశ వ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. తాజాగా సీబీఎస్ఈ సిలబస్ తో పాటు యోగాను కూడా విద్యార్థులకు అలవరించేందుకు బాబా రాందేవ్ కొంతకాలం క్రితం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో ఆచార్య కులం పేరిట విద్యాలయాన్ని ఏర్పాటు చేసిన ఆయన దానికి గుర్తింపునివ్వాలని కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. యూపీఏ హయాంలో అందిన ఈ దరఖాస్తుకు ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు.