: వెండితెరకెక్కనున్న ఒబామా ప్రేమకథ
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిషెల్ ల ప్రేమకథ వెండితెరకెక్కనుంది. ఈ మేరకు సౌత్ సైడ్, యూ విల్ సంస్థలు కసరత్తు ప్రారంభించాయి. అగ్రరాజ్యంగా కొనసాగుతున్న అమెరికా ప్రథమ పౌరుడి ప్రేమకథ అంటే విశ్వవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించేదే కదా. మరి ఈ చిత్రంలో ఒబామా, మిషెల్ పాత్రల్లో నటించే అవకాశం ఎవరికి దక్కనుందన్న విషయంపైనా ఎనలేని ఉత్కంఠ నెలకొంది. ఒబామా ప్రేమకథను చిత్రంగా తెరకెక్కించనున్న విషయాన్ని వెల్లడించిన ఆ రెండు నిర్మాణ సంస్థలు, నటుల విషయంలో మాత్రం జాగ్రత్తగా అడుగులేస్తున్నాయి. మిషెల్ యుక్త వయసు పాత్రకు టికా సంఫ్టర్ ను ఎంపిక చేసుకున్న ఆ సంస్థలు ఒబామా పాత్రకు నటుడిని వెదికే పనిలో పడ్డాయి. మరి ఈ అరుదైన అవకాశం ఎవరికి దక్కుతుందో వేచి చూద్దాం. యుక్త వయసులో ఉండగా బరాక్ ఒబామాతో మిషెల్ కలిసి షికాగోలో చూసిన తొలి చిత్ర ప్రదర్శనను ఈ చిత్రంలో హైలైట్ చేస్తారని సమాచారం. ఇక దర్శకత్వం విషయానికొస్తే, రిచర్డ్ టేన్ తాను సొంతంగా రూపొందించుకున్న స్క్రిప్ట్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. విశ్వవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న ఈ చిత్రానికి ట్రేసీ సింగ్, స్టెఫానీ అలైన్ లు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.