: ఎన్ డీఏ నుంచి వైదొలగిన ఎండీఎంకే పార్టీ
వైగోకు చెందిన 'మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం' (ఎండీఎంకే) పార్టీ ఎన్ డీఏ తో తెగదెంపులు చేసుకుంది. ఈ మేరకు చెన్నైలో సమావేశమైన పార్టీ పార్లమెంటరీ బోర్డు ఎన్ డీఏలో కొనసాగాలా? వద్దా? అనే అంశంపై చర్చించింది. అనంతరం బీజేపీతో పొత్తును తెంచుకోవాలని ఓ తీర్మానం చేసింది. తమిళనాడు ప్రజల అవసరాలకు సంబంధించి బీజేపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎండీఎంకే ఆరోపించింది. ముళ్లపెరియార్ డ్యాం రక్షణకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించేందుకు కేంద్రం అనుమతించిందని, కావేరీ జలాల విషయంలో రాష్ట్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించడం లేదని తీర్మానంలో విమర్శించింది. అంతేగాక, శ్రీలంకలో ఎన్నికల సందర్భంగా అధ్యక్షుడు మహింద రాజపక్స విజయం సాధించాలంటూ మోదీ శుభాకాంక్షలు తెలపడాన్ని తీవ్రంగా ఖండించింది. ఇలా పలు విషయాలపై కేంద్రాన్ని తన తీర్మానంలో వైగో పార్టీ తప్పుబట్టింది.