: భగవద్గీతకు జాతీయ హోదాపై కరుణానిధి వ్యతిరేకత
హిందువుల పవిత్ర గ్రంధం భగవద్గీతకు జాతీయ హోదా కల్పిస్తామంటూ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ చేసిన ప్రకటనపై డీఎంకే అధినేత ఎం.కరుణానిధి మండిపడ్డారు. భారతదేశం లౌకిక దేశం అన్న విషయాన్ని గమనించాలని పేర్కొంటూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మన దేశం లౌకిక, గణతంత్ర దేశమని రాజ్యాంగం నిర్ణయించిందన్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తప్పకుండా అన్ని మతాల వారిని సమానంగా చూడాలని, లౌకిక సిద్ధాంతాలనే అనుసరించాలని సూచించారు. వివిధ ప్రజా సంక్షేమ చర్యలు చేపడుతున్న బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఇటువంటి అనవసర చర్యల ద్వారా తన పేరును పాడు చేసుకుంటోందన్నారు. ఇలాంటి వివాదాస్పద విషయాల ద్వారా అభివృద్ధి కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కరుణ విజ్ఞప్తి చేశారు.