: మార్చి 11 నుంచి ఏపీలో ఇంటర్ పరీక్షలు: మంత్రి గంటా
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరీక్షలు మార్చి 11 నుంచి నిర్వహించనున్నట్టు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఉమ్మడి పరీక్షలకు తెలంగాణ ప్రభుత్వం కలసి రాలేదన్నారు. 'మా రాష్ట్రం విడిపోయింది, మా పరీక్షలు మేమే పెట్టుకుంటామంటూ' మొదట నుంచి తెలంగాణ సర్కారు మొండిగా చెబుతూ వచ్చిందన్నారు. దాంతో, విడివిడిగా ఇంటర్ పరీక్షలు నిర్వహించుకోవాలన్న నిర్ణయంతో ఏపీ ప్రభుత్వం కూడా మొదట ఖారారు చేసిన తేదీ నుంచే పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రశ్నాపత్రాలు, షెడ్యూల్ తయారవుతోందని తెలిపారు. అయితే ఎంసెట్ నిర్వహణపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని, ఎంసెట్ లో మార్పులు తెచ్చే అంశంపై అధ్యయనం చేస్తున్నామని గంటా పేర్కొన్నారు. తమిళనాడు తరహా విధానాన్ని అనుసరించాలన్న యోచనలో ఉన్నామని మీడియా సమావేశంలో చెప్పారు.