: పాత ల్యాప్ టాప్ బ్యాటరీలతో మురికివాడల్లో వెలుగులు!
ల్యాప్ టాప్ నుంచి తొలగించిన పాత బ్యాటరీలతో మురికివాడల్లో వెలుగులు పంచవచ్చని ఐబీఎం ఇండియా చేపట్టిన ఓ అధ్యయనం చెబుతోంది. ఈ అధ్యయన వివరాలను అమెరికాలోని శాన్ జోస్ లో జరిగిన ఓ కాన్ఫరెన్స్ లో వెల్లడించారు. పాత బ్యాటరీల్లో ఓ ఎల్ఈడీ బల్బును 4 గంటలకు పైగా వెలిగించేందుకు అవసరమైన శక్తి మిగిలే ఉంటుందని గుర్తించారు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 50 మిలియన్ల లిథియమ్ అయాన్ బ్యాటరీలను తొలగిస్తున్నారని, వాటిలో అత్యధిక బ్యాటరీలను మరలా వినియోగించుకోవచ్చని ఐబీఎం ఇండియా పేర్కొంది. సోలార్ ప్యానెళ్లను ఈ బ్యాటరీలకు అనుసంధానించడం ద్వారా ఎల్ఈడీ బల్బులను వెలిగించవచ్చని అధ్యయనం వివరిస్తోంది. సాధారణంగా సోలార్ విద్యుత్ వ్యవస్థలో బ్యాటరీనే ఖరీదైన పరికరం అని, పాత ల్యాప్ టాప్ బ్యాటరీలను వినియోగించడం ద్వారా ఖర్చు తగ్గించుకోవచ్చని వికాస్ చంద్రన్ అనే శాస్త్రవేత్త తెలిపారు.