: ఈ పదేళ్లలో వ్యవస్థలు భ్రష్టుపట్టాయి: చంద్రబాబు
సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న అనంతరం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రణాళిక సంఘం స్థానంలో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా, నూతన సంప్రదాయానికి ప్రధాని శ్రీకారం చుట్టారని బాబు కొనియాడారు. ప్రత్యామ్నాయ వ్యవస్థ కోసం ప్రధాని ఆలోచించారని వివరించారు. స్వాతంత్ర్యానంతరం చాలాకాలం తర్వాత దేశంలో ఆర్ధిక సంస్కరణలు ప్రారంభమయ్యాయని, ఆ తర్వాతే అభివృద్ధికి నోచుకున్నామని అన్నారు. అయితే, ఈ పదేళ్లలో దేశంలోని వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టాయని అన్నారు. ఇన్నాళ్లు ప్రణాళిక సంఘం తీరు ఓ ప్రహసనంలా ఉండేదని, దిశాదశా నిర్దేశించే పరిస్థితి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. ప్రణాళిక సంఘం, ఆర్థిక సంఘం మధ్య సమన్వయం ఉండేది కాదన్నారు. వ్యవస్థలో లోపాల వల్ల నిర్ణయాలు తీసుకోలేకపోయారని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు పరిస్థితి మారే సమయం ఆసన్నమైందని తెలిపారు. అనుభవం ఉన్న వ్యక్తి ప్రధాని అయ్యారని, రాష్ట్ర పాలనలో అనుభవం ఉన్న వ్యక్తి కూడా కావడం లాభించే అంశమని అన్నారు. పరిస్థితులను ఆయన అంచనా వేస్తున్నారని తెలిపారు. రాజకీయాల కంటే అభివృద్ధి ముఖ్యమని, దేశం కోసం ప్రణాళికలు తయారుచేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రణాళిక సంఘం స్థానంలో ముఖ్యమంత్రుల మండలి ఉండాలని బాబు పేర్కొన్నారు. తాను సింగపూర్, జపాన్ దేశాల్లో పర్యటించిన సందర్భంగా ప్రజల్లో ఎదుగుదల పట్ల ఆసక్తిని గమనించానని, మనం కూడా ఆ తరహాలో విజన్ ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. విజన్ 2050తో ముందుకు వెళ్లాలని, అది సాకారమైతే, మరో 35 ఏళ్లలో మనదేశం ప్రపంచంలో ఒకటో స్థానంలోనో, లేక, రెండో స్థానంలో ఉంటుందని అభిప్రాయపడ్డారు.